పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించండి – గౌతమ్ రెడ్డిని కలిసిన యువనేత. డా. ధర్మాన కృష్ణ చైతన్య

0
179

నరసన్నపేట, జూన్ 5:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రితో చర్చించారు. ఏళ్ల తరబడి వలసలు పోతున్న వారికి చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా కారణంగా  చాలా మంది వెనక్కి వస్తున్నారని, వారికి ఉపాధి కరువై ఆందోళనలో ఉన్నారని చెప్పారు. దీనికి పర్యావరణ హితమైన  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ఒక్కటే మార్గమని చెప్పారు. జిల్లాలోనూ ప్రత్యేకించి నరసన్నపేట నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, భూమి, నీటి లభ్యతకు ఇబ్బంది లేదని ప్రధాన జాతీయ రహదారి,  రైల్వే మార్గం ఉండటం కలిసి వచ్చే అంశాలు అని చెప్పారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ ( సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) ల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ఎంతో మేలు చేసిందని కృష్ణ చైతన్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.