చిట్వేలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ-విద్యార్థులకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన నిష్ణాత ఉపాధ్యాయ బృందం ఈ మెటీరియల్‌ను అత్యధిక మార్కులు సాధించే లక్ష్యంతో రూపొందించింది.
ఈ స్టడీ మెటీరియల్‌ను రాజుగుంట గ్రామ సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో ఎస్టీయు ఆధ్వర్యంలో మండలంలోని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తి నరసింహ మాట్లాడుతూ విద్యార్థులే భవిష్యత్ భారతానికి పునాదని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి చిట్వేలి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి కందల హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన మెటీరియల్‌ను శ్రద్ధగా చదివితే విద్యార్థులు తప్పకుండా అధిక మార్కులు సాధించగలరని అన్నారు. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, పోల్లోపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్, వెంకటరాజుపల్లి ఉపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారి తులసి, చిట్వేలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివనారాయణ గౌడ్, ప్రవీణ్ కుమార్, మధు, ఈశ్వర్ రాజు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విలువైన మెటీరియల్ అందించిన దాతకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.



