విశాఖపట్నం 49 వ వార్డు ప్రాంతంలోని పట్టాభి రెడ్డి తోట లో కార్పెంటర్ వర్క్‌షాప్‌ను అనధికారికంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేయడంతో, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెక్క పనిలోనుంచి వెలువడుతున్న నిరంతర ధూళి, పొగ, చిప్స్ వల్ల ఇళ్లలోపలికే కాలుష్యం చేరుతుండగా, ప్రయాణికులు సైతం దారిలో నడవటానికి ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు రోడ్డున ఆక్రమించి రోడ్డుపైనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా దారి తీస్తుంది
పగలు–రాత్రి నిరంతరం నడుస్తున్న ఈ కార్ఖానా నుంచి వచ్చే మైక్రోపార్టికల్స్ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ శ్వాసకోశ సమస్యలను తెస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గు, జలుబు, కంటి మంట, ఆస్థ్మా లక్షణాలు తీవ్రంగా పెరిగాయని ఆరోపిస్తున్నారు. పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోవడమే ప్రమాదంగా మారింది.
కార్ఖానా యజమాని భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ భద్రత, ప్రజా ఆరోగ్య నిబంధనలను పూర్తిగా పట్టించుకోకుండా నియమ విరుద్ధంగా వర్క్‌షాప్ నడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. పర్యావరణ శాఖ, గ్రామపంచాయతి అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రజలు ప్రశ్నిస్తున్నారు:
“జనావాసాల మధ్య కార్ఖానా ఎలా అనుమతించారు? ప్రతిరోజూ మా ఇళ్లలోకి వచ్చే ధూళి, శబ్ద కాలుష్యాన్ని ఎవరు ఆపాలి?”
స్థానికులు వెంటనే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కార్ఖానాను నివాసాల నుంచి దూరంగా మార్చాలని, లేకపోతే తీవ్ర నిరసనలు చేపట్టడమే మార్గమని హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ కార్ఖానాపై చర్యలు ఎప్పుడు?—అన్నది ఇప్పుడు అక్కడి ప్రజల పెద్ద ప్రశ్నగా మారింది.


