గూడెం కొత్తవీధి(పున్నమి ప్రతినిధి), నవంబర్: 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పకృతి వ్యవసాయ పద్ధతులను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పకృతి వ్యవసాయంలో పండిస్తున్న పంటలకు ప్రీమియం ధరలు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థ సీఈవో టి. బాబురావు నాయుడు తెలిపారు.
గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లి, దేవరపల్లి, పెదవలస పంచాయతీల పరిధి గ్రామాల్లో పకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న రైతులను ఆయన సందర్శించి పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతి వ్యవసాయం భూమికి, రైతుకి మేలు చేసే విధానం అని, దీన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు పద్ధతులను అవలంబిస్తోందని పేర్కొన్నారు. పకృతి పద్ధతుల్లో పండిన పంటలకు స్థిరమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పరచేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు.
పెదవలస పంచాయతీ టెంట్ల వీధిలో గిరిజన రైతులు రైజ్డ్ బెడ్ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు పంటలను పరిశీలించి రైతులను అభినందించారు. అనంతరం దేవరపల్లి పంచాయతీ చుట్టుగుంది గ్రామాన్ని సందర్శించి, పకృతి విధానంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డీపీఎం భాస్కర్ రావు, గిరిజన వికాస్ సెక్రటరీ నెల్లూరు వెంకట సత్యనారాయణ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ యమున, రమ్య తదితరులు పాల్గొన్నారు.


