సత్తుపల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బానోత్ విజయ్‌పై జరిగిన దాడిని బిజెపి సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హింసాత్మక చర్యలు సమంజసం కాదని, సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జి.ఓ. నంబర్ 9 విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆ జి.ఓ.ను రద్దు చేయగా, సుప్రీంకోర్టులో ఆపిల్ చేసినా అదే నిర్ణయం కొనసాగిందని ఆయన గుర్తుచేశారు.
“రిజర్వేషన్లు ప్రజాస్వామ్య, చట్టబద్ధ మార్గాల్లో సాధించాలి. కొట్లాటలు, హింసాత్మక చర్యలతో సాధించేది ఏమీ లేదు,” అని సుధాకర్ రెడ్డి గారు అన్నారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అని ఆయన పేర్కొన్నారు.
“ప్రధాని బీసీ వర్గానికి చెందినవారు. కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాష్ట్రపతి గిరిజన మహిళ. మహిళలకు 33% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% రిజర్వేషన్ ఇచ్చింది బిజెపి ప్రభుత్వమే,” అని వివరించారు.
సత్తుపల్లిలో బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, “ఒక గిరిజన నాయకుడిపై దాడి చేయడం తగదు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కార్యక్రమంలో ఎక్కడా అపశ్రుతులు చోటుచేసుకోలేదు. కేవలం సత్తుపల్లిలోనే కావాలనే బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా ఖండించదగ్గది” అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం చట్టబద్ధ మార్గాల్లోనే సాధ్యమని, హింసకు దూరంగా ఉండి సంభాషణల ద్వారా ముందుకు సాగాలని సుధాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. “ప్రజాస్వామ్యమే నిజమైన మార్గం,” అని ఆయన స్పష్టం చేశారు.


