నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్)’ కార్యక్రమంలో మొత్తం 127 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులతో జవాబుదారీగా వ్యవహరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వేదికకు వచ్చిన ఫిర్యాదుల్లో మహిళలపై వేధింపులు, అదనపు కట్న వేధింపులు, మిస్సింగ్ కేసులు, భూమి వివాదాలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అనంతసాగరం పరిధిలో ప్రేమ పేరుతో వేధింపులు, బాలాజీ నగర్‌లో మిస్సింగ్ కేసు, నవాబుపేటలో కట్న వేధింపులు, కావలి రూరల్‌లో భూ వివాదం, అల్లూరు ప్రాంతంలో మహిళపై వేధింపులపై ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఫిర్యాదులన్నింటినీ చట్టపరంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని, ప్రతి కేసును ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సౌజన్య గారు, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, డబ్ల్యూపీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



