Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరులో ఈఎస్ఐ వైద్య సేవలు అస్తవ్యస్తం

Punnami Newsroom Published:
నెల్లూరులో ఈఎస్ఐ వైద్య సేవలు అస్తవ్యస్తం

Story highlights

  • వసతుల లేమితో కార్మికుల అవస్థలు..
  • హామీలకే పరిమితమైన వంద పడకల ఆసుపత్రి నెల్లూరు: కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ వైద్య కేంద్రాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి.
  • మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో ఆసుపత్రులకు వస్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వసతుల లేమితో కార్మికుల అవస్థలు.. హామీలకే పరిమితమైన వంద పడకల ఆసుపత్రి

నెల్లూరు: కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ వైద్య కేంద్రాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో ఆసుపత్రులకు వస్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకేనగర్‌లో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామన్న ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం కార్మికుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

జిల్లాలో సుమారు 80 వేలకు పైగా కార్మికులు ఈఎస్ఐ సేవలపై ఆధారపడుతున్నప్పటికీ, ఏకేనగర్, పడుగుపాడు, నవాబుపేట, గూడూరు ప్రాంతాల్లోని నాలుగు డిస్పెన్సరీలే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. వీటిలో సాధారణ జబ్బులకు మాత్రమే చికిత్స అందుతోందని, అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పలు వైద్య కేంద్రాల్లో భవనాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. వర్షాలు కురిసినప్పుడు పైకప్పుల నుంచి నీరు కారడం, మరుగుదొడ్లు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం రోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. నెల్లూరు, పడుగుపాడు కేంద్రాలను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మారుస్తామన్న హామీలు కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

వైద్య పరీక్షల విషయంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. గత ఆరు నెలలుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయని, రక్త పరీక్షలకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని రోగులు చెబుతున్నారు. వైద్యులు మందులు సూచిస్తున్నప్పటికీ అవసరమైన ఔషధాలు పూర్తిస్థాయిలో లభించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు అవసరమైన మందులు అందక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితులపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈఎస్ఐకి క్రమం తప్పకుండా చందాలు చెల్లిస్తున్న కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు, డిస్పెన్సరీలకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, మందులు, రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *