నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ అరెస్ట్
రెండు రోజుల ACB కస్టడీకి కోర్టు ఆదేశం
హైదరాబాద్:
నిధుల దుర్వినియోగం కేసులో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, రెండు రోజుల పాటు ఎసీబీ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు, ఎల్లుండి సంజయ్ ఎసీబీ కస్టడీలో విచారణ ఎదుర్కొననున్నారు.
కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెలికితీయాల్సి ఉందని ఎసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, విచారణ సాఫీగా సాగేందుకు కస్టడీ అవసరమని తేల్చి నిర్ణయం తీసుకుంది.
అధికార స్థాయిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ కొనసాగుతుండగా, సంజయ్ అరెస్టుతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సంబంధిత విభాగాల నుండి పలు పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో సంజయ్‌ను ఎదురెదురుగా ప్రశ్నించనున్నారు అధికారులు.

