15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
రుడా, మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం
*అమృత్ పథకం ద్వారా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిడదవోలు పట్టణానికి మంచినీరు*
*రూ.9.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించాం*
*జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెలరోజులు ప్రచార కార్యక్రమం..అక్టోబర్ 19న పెద్ద పండుగగా కార్యక్రమం నిర్వహిస్తాం*
*రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర క్రింద ఏటా రూ.15వేలు.. దసరా కానుకగా ఈ అక్టోబర్ 4న నిధుల విడుదల*
*నిడదవోలు పురపాలక సంఘ సాధారణ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి*
*నిడదవోలు మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపు..అందరి సహకారంతో నిడదవోలులో అభివృద్ధి సాధ్యం*
నిడదవోలు: 15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘ సాధారణ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నిడదవోలు పట్టణ అభివృద్ధికి తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ సభ్యులు, అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.
*రుడా, మున్సిపల్ శాఖ నిధులతో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు:మంత్రి దుర్గేష్*
రుడా,రాష్ట్ర మున్సిపల్ శాఖ నుండి ఇతోధికంగా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి దుర్గేష్ అన్నారు.రూ.7.74 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తమ ప్రత్యేక కృషితో నిడదవోలులో షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ తదితర అభివృద్ధి పనులకు రుడా నిధులు సమీకరించామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.1 కోటి 60 లక్షలు రావాల్సి ఉందన్నారు. రుడా సాధారణ నిధుల నుండి రూ.86 లక్షలు తీసుకువచ్చామన్నారు. ఈ విషయమై రుడా ఛైర్మన్, వీసీతో మాట్లాడానన్నారు. డీపీఎస్, ఎల్ఆర్ఎస్ నుండి రూ.3 కోట్ల నిధులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. కోటి మంజూరు అయిందన్నారు. వాస్తవానికి ఒక కోటి రూపాయల నిధులు మాత్రమే మున్సిపాలిటీలకు కేటాయిస్తుండగా నిడదవోలు మున్సిపాలిటీ కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి రూ.3 కోట్ల నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నానన్నారు. తద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశముందన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంలో చాలా ప్రగతి సాధించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నామన్నారు. మంచినీటి పథకం విషయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రైల్వే శాఖ 8 కోట్ల 67 లక్షల 61 వేల 539 రూపాయలు ఇస్తే, మున్సిపల్ శాఖ నుండి రూ.75 లక్షలు ఏర్పాటు చేస్తామన్నామన్నారు. మొత్తంగా 9 కోట్ల 42 లక్షల 61 వేల 539 రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించామని వెల్లడించారు. రహదారులపై చెత్తా చెదారం, మురుగు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ నిడదవోలుకు బాటలు వేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా నిడదవోలు పట్టణ అభివృద్ధికి నడుం బిగిద్దాం అని వెల్లడించారు.
*అమృత్ పథకం ద్వారా నిడదవోలుకు మంచినీరు:మంత్రి దుర్గేష్*
నిడదవోలు పట్టణంలో అమృత్ పథకం, గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. సరిగ్గా ఆ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల నిడదవోలు పట్టణానికి అందాల్సిన గోదావరి జలాలు అందలేకపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఏషియన్ బ్యాంక్ తో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చర్చించి సంబంధిత నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారన్నారు. తాము రాసిన లేఖలకు ఏషియన్ బ్యాంక్ స్పందించి సహకారం అందిస్తామన్నారు. ఈ క్రమంలో నిడదవోలు పట్టణానికి గోదావరి వాటర్ ప్రాజెక్ట్ అమృత్ క్రింద నీళ్లు రప్పించేందుకు ఆమోదం లభించిందన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.85 కోట్ల 82 లక్షలు కాగా అందులో ఎన్టీఆర్ నగర్ కు రూ.5 కోట్ల 96 లక్షలు, మాలకొండ చెరువుకు రూ. 4 కోట్ల 53 లక్షలు, ఎస్ టీపీ (సూయజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) కి రూ.11 కోట్ల 5 లక్షలు మొత్తంగా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో అమృత్ పథకం ద్వారా నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించనున్నామన్నారు. గతంలో సోర్స్ సరిగా లేకపోవడం వల్ల ఎక్కడి నుండి నీరు తీసుకుంటున్నామో స్పష్టత కొరవడిందన్నవారు.తద్వారా ప్రాజెక్టు పట్టాలెక్కలేదని, ఈ క్రమంలో కేవలం పైప్ లైన్లతో సరిపెట్డడం వల్ల నీళ్లు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోర్స్ ను ఏర్పాటు చేసి విజ్జేశ్వరం దగ్గర గేట్ల ఏర్పాటు ద్వారా గ్రిడ్ నుండి నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.
*జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పన:మంత్రి దుర్గేష్*
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపయోగం ఉందని మంత్రి దుర్గేష్ వివరించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోయన్నారు. దసరా నుండి దీపావళి వరకు నెలరోజుల పాటు జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగే మేలుపై అవగాహన కల్పిద్దామన్నారు. అక్టోబర్ 19న పెద్ద పండుగగా నిర్వహిద్దామని సూచించారు.
*ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి:మంత్రి దుర్గేష్*
స్త్రీశక్తి ద్వారా మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. తద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోకుండా అక్టోబర్ 4వ తేదీన వారి ఖాతాల్లో వాహనమిత్ర క్రింద రూ.15వేలు జమ చేయనుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి జరుగనుందన్నారు.
*అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు లబ్ధి:మంత్రి దుర్గేష్*
ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అధికారుల ద్వారా తెలుసుకునే హక్కు ప్రజలకుందని మంత్రి దుర్గేష్ అన్నారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని చేరవేసే బాధ్యత అధికారులకుందని అన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన ద్వారా రైతన్నలకు అందిస్తున్న రూ.20వేల ఆర్థికసాయం, దీపం-2 ద్వారా ఏటా ప్రజలకు అందిస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న విషయాలు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మెప్మా ద్వారా చేపట్టే కార్యక్రమాలు అందరికీ తెలియాలన్నారు. వివిధ పథకాల క్రింద కూటమి ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
*కోటసత్తెమ్మ ఆలయం వెనుక మురుగునీరుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు*
తిమ్మరాజుపాలెంలో కొలువైన కోటసత్తెమ్మ ఆలయం వెనుక ఉన్న మురుగు అమ్మవారి పాదాల చెంతకు వచ్చి అపవిత్రం అవుతుందని, అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. కాలయాపన చేయకుండా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలన్నారు.
*నిడదవోలు సమగ్రాభివృద్ధి చేసి చూపిస్తాను:మంత్రి కందుల దుర్గేష్*
నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.నిడదవోలులో మంచి బస్ సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.ఈ విషయమై ఇప్పటికే చర్చించానన్నారు.సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన వెంటనే నిడదవోలు పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లౌడ్ స్పేస్ పెంచే విషయమై ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తో, ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ తో మాట్లాడానన్నారు.నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ పట్టణంలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు తాను హాజరవుతున్నానన్నారు.తద్వారా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. నిడదవోలుకు మంచి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
*అందరి సహకారంతో నిడదవోలు అభివృద్ధికి చర్యలు..నిడదవోలు ఖ్యాతి పెరిగేలా పనిచేద్దామని పిలుపు:మంత్రి దుర్గేష్*
అందరి సహకారంతో నిడదవోలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు గొప్పతనం ప్రజలకు తెలియాలన్నారు.శాతావాహనుల కాలం నుండి నిడదవోలుకున్న చరిత్రను బయటి ప్రపంచానికి తెలపాల్సిన అవసరాన్ని వెల్లడించారు. నిడదవోలులోని ఆలయాలు, చర్చిలు, మసీదులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.వాటిని పబ్లిసిటీ చేసుకోవాలన్నారు. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీలకతీతంగా అందరూ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేయాలన్నారు.నిడదవోలు ఖ్యాతి పెరిగేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు.నిడదవోలు చరిత్ర అందరికీ తెలిసేలా వేడుకలు నిర్వహించుకుందామన్నారు.విజయవాడ ఉత్సవ్ లా నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను వివిధ ఉత్సవాల ద్వారా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సాంస్కృతిక శాఖ మంత్రిగా తాను అనేక శాశ్వత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు.భవిష్యత్ లో నిడదవోలు అభివృద్ధికి ఏ తరహా చర్యలు చేపడితే బాగుంటుందో అభిప్రాయాలు తెలపాలని కోరారు.
కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు , అధికారులు పాల్గొన్నారు.


