అనకాపల్లి జిల్లా, మార్చి 9 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల విద్యార్థి ఆడారి కౌశిక్ నాటు తుపాకీ కాల్పుతో మృతి చెందాడు.
స్థానిక సమాచారం ప్రకారం, కౌశిక్ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో వేటకు ఉపయోగించే నాటు తుపాకీ పిల్లల చేతికి చిక్కింది. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో బుల్లెట్ కౌశిక్ ఛాతిలో తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం బాలుడి మృతదేహాన్ని ఒకచోట నుంచి మరోచోటికి తరలించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట కాలువ సమీపంలో కనిపించిన మృతదేహం తర్వాత పొదల్లో గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.









