చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం నాగులవెల్లటూరులో భగవాన్ శ్రీశ్రీ వెంకయ్య స్వామి 39వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేశవ చౌదరి మాట్లాడుతూ,వెంకయ్య స్వామి వారి జన్మస్థలం,ఆయన నడయాడిన ఈ పవిత్ర ప్రదేశం కేవలం ఈ జిల్లాలోనే కాకుండా కడప జిల్లా వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులను ఆకర్షిస్తోందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నామని,తాను ఆలయ కమిటీ చైర్మన్‌గా సేవలందిస్తున్నానని పేర్కొన్నారు.అదేవిధంగా స్వామి వారి కరుణాకటాక్షం వలననే తాను డిసెంబర్ నుంచి సోమశిల ప్రాజెక్టు చైర్మన్‌గా నియమితులయ్యానని,ఈ అదృష్టం పూర్తిగా ఆయన ఆశీస్సుల ఫలితమేనని ఆయన తెలిపారు.ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ,భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో భక్తులు నిర్వహించిన భజన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది.భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమంలో మహిళలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


