ఫార్మా, మెడికల్ డివైసెస్ అభివృద్ధిపై డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విన్నపం.
విశాఖపట్నం, సెప్టెంబర్ 15:
ఫార్మా రంగ అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై ఆదివారం సాయంత్రం హోటల్ దేవి గ్రాండ్ ఇన్ లో జరిగిన స్టేక్‌హోల్డర్స్ సమావేశానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫార్మా పరిశ్రమల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత చర్చలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ ఆర్ సి లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కూడా పాల్గొని మంత్రికి పలు అంశాలపై విన్నవించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఫార్మా రంగంలో జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని కోరారు.
పరిశ్రమల విస్తరణతోపాటు మెడికల్ డివైసెస్ తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో మెడికల్ డివైసెస్ మార్కెట్ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా, 2030 నాటికి అది 50 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంచనా వేయబడిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాలు మెడికల్ డివైసెస్ తయారీకి అనువైన క్లస్టర్లుగా అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
దీని వలన వేలాది కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు దేశీయ ఉత్పత్తి పెరుగుదల మరోవైపు ఎగుమతుల వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేసే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (CETPs) బలోపేతం చేసి, పర్యావరణ అనుకూల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆరోగ్యరంగం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకుంటోందని అన్నారు.
ఔషధాల తయారీలో భారత్ ప్రపంచానికి ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా నిలిచిందని, ఇప్పుడు అదే స్థాయి విజయాన్ని మెడికల్ డివైసెస్ రంగంలో సాధించాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ , రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ , అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సిఎం. రమేష్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


