నగర వ్యర్థాల పారవేయడంపై నిత్య పర్యవేక్షణకు డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం.
* నియంత్రణ చర్యల దిశగా “షీ” టీమ్స్ తనిఖీలు.
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: వ్యర్థాల పారవేయడాన్ని నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలు, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత ద్వారా నిత్య పర్యవేక్షణ జరుగుతోందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డ్రోన్ల ద్వారా సేకరించిన దృశ్యాలను సిటి ఆపరేషన్ సెంటర్ (COC) లో AI సహాయంతో విశ్లేషిస్తున్నామని, ఆ ఆధారంగా జీవీఎంసీ “షీ” టీమ్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నాయని, జరిమానాలు విధించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నామని గురువారం ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
బుధవారం రాత్రి 4వ జోన్ పరిధిలోని పూర్ణా మార్కెట్ నుంచి కనకమహాలక్ష్మి ఆలయ జంక్షన్ వరకు డ్రోన్, AI ఆధారిత పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో టౌన్ కోత రోడ్ నుండి కనకమహాలక్ష్మి ఆలయం వరకు ఉన్న ఫుట్‌పాత్‌ల వెంట అధికంగా వ్యర్ధాలు పేరుకుపోయినట్లు గమనించామని, ఆ ప్రాంతంలోని దుకాణదారులలో చాలామంది డస్ట్‌బిన్‌లు వినియోగించకపోవడం గుర్తించామని ఆయన తెలిపారు.
బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లు, కాలువలలో వ్యర్ధాలు వేయడాన్ని అరికట్టేందుకు జీవీఎంసీ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. డ్రోన్లు, AI సాంకేతికత ద్వారా వ్యర్ధాలు వేస్తున్న వ్యక్తులు లేదా వ్యాపారులను గుర్తించి, షీ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ చర్యల్లో భారీ జరిమానాలు విధించడం, ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడం, అవసరమైన అమలు చర్యలు చేపట్టడం ఉంటుందని కమిషనర్ తెలిపారు.
నగర పరిశుభ్రతను కాపాడటంలో వ్యాపారులు, ప్రజల సహకారం అత్యంత అవసరమని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి మరియు పౌరులు తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఉపయోగించి, వ్యర్ధాలను కేవలం నిర్ణీత సేకరణ వాహనాలకే అప్పగించాలని సూచించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పత్రికా ప్రకటన ద్వారా కోరారు.


