నగరంలో సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి .
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .
*విశాఖపట్నం డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*: విశాఖ నగరంలో పలు ప్రాంతాలలో సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ పరిధిలోని ముడసరలోవ, రాడిసన్ బ్లూ నుండి సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం ఎంతో అవసరమని అందుకు నగరంలో ముడసరలోవ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్లు, రాడిసన్ బ్లూ హోటల్ సమీప ప్రాంతం నుండి సాగర్ నగర్ బీచ్ సమీప ప్రాంతం వరకు సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ముడసరలోవ చుట్టూ సైకిల్ ట్రాక్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బీచ్ రోడ్ లో సబ్మేరియన్ ఎదురుగా గల టియు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సమీపంలో 75 నుండి 100 మీటర్ల లోపు ఒక జాతీయ జెండా ఏర్పాటుకు అంచనాలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం మధురవాడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేశారు.
ఈ పర్యటనలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్- ఏపీ యు ఐ ఏ ఎం ఎల్ ,రీజినల్ హెడ్ చేతన్, జీవీఎంసీ సహాయక ఇంజనీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


