చిట్వేల్, అక్టోబర్ 17: (ఎల్లో సింగం ప్రతినిధి)
రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రత కోసం అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బాణసంచా నిల్వలు, విక్రయాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ప్రభుత్వం జారీ చేసిన పేలుడు పదార్థాల చట్టం ప్రకారం నిర్దేశించిన నిబంధనలను తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నిబంధనలుబాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి తప్పనిసరి.నిల్వల ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పక అమలు చేయాలి.విక్రయాలు జనవాసాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులకు దూరంగా, అధికారులు నిర్ణయించిన సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే జరగాలి.దుకాణాల మధ్య తగినంత భద్రతా దూరం పాటించాలి.ప్రతి విక్రయ కేంద్రంలో అగ్ని నిరోధక సిలిండర్లు, ఇసుక, నీటి బకెట్లు తప్పనిసరిగా ఉంచాలి.బాణసంచా నిల్వ ఉన్న ప్రదేశాలలో ధూమపానం, పెట్రోల్ లేదా మండే వస్తువులు ఉంచరాదు.18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బాణసంచా తయారీ లేదా విక్రయాల్లో నియమించరాదు. ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తిదీపావళి సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు చిన్నపిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి.గడ్డి నిల్వల దగ్గర, పశువుల పాకల వద్ద, లేదా పెట్రోల్ బంక్‌ల సమీపంలో పటాకులు కాల్చరాదు.పటాకులు కాల్చేటప్పుడు నూలు (కాటన్) దుస్తులు మాత్రమే ధరించాలి.బాణసంచా అక్రమ విక్రయాలు లేదా నిల్వల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని హామీ ఇచ్చారుజిల్లా ప్రజలందరూ నిబంధనలు పాటించి, ప్రమాద రహిత దీపావళి జరుపుకోవాలని కోరుతూ”అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వలు, విక్రయాలు నిర్వహించినా చర్యలు తప్పవు” అని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు.


