ఖమ్మం మార్చి
(పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి )
ఖమ్మం: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు మూలస్తంభంగా నిలిచిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఖమ్మం రెండవ పట్టణ కమిటీ మరియు కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ ప్రశిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, దేశం కోసం పార్టీ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ అభివృద్ధి కోసం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చేసిన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ దేశానికి దారిదీపంలా మారాయని తెలిపారు. ఆయన ప్రతిపాదించిన “ఏకాత్మ మానవతా వాదం (Integral Humanism)” అనే సిద్ధాంతం భారతీయ సంస్కృతి, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒక గొప్ప తత్వవేత్త, రచయిత మరియు జాతీయవాది. ఆయన భారతీయ జనసంఘ్‌కు ప్రధాన నాయకత్వం వహించి, దేశంలో జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాది వేశారు. గ్రామీణ అభివృద్ధి, చివరి వరుసలో ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయడం ఆయన ఆలోచనల్లో ముఖ్యమైన అంశమని గల్లా సత్యనారాయణ తెలిపారు. “అంత్యోదయ” అనే భావన ద్వారా సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారని గుర్తు చేశారు.
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవితం సాధారణత, నిబద్ధతకు ప్రతీక అని పేర్కొంటూ, ప్రతి బీజేపీ కార్యకర్త ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని గల్లా సత్యనారాయణ సూచించారు. దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు ఆయన వ్యక్తిత్వానికి మూలాధారమని తెలిపారు.
ఇలాంటి శిక్షణ శిబిరాలు కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహన పెంచి పార్టీ బలోపేతానికి దోహదపడతాయని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని ప్రతి కార్యకర్త ప్రజల మధ్య పనిచేస్తూ పార్టీని మరింత బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకి చెందిన బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల, పోలింగ్ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .


