
విశాఖపట్నం, సెప్టెంబర్ 25: దసరా పండుగ సందర్భంగా ఆపరేషన్ లంగ్స్ 2.0 ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌కు తాత్కాలిక విరామం ఇవ్వడమైనదని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు పత్రికా ప్రకటన ద్వారా గురువారం తెలిపారు.
విశాఖపట్నం అభివృద్ధి దిశగా జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కొనసాగుతోందని, అయితే దసరా వేడుకల దృష్ట్యా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆక్రమణదారులు స్వయంగా వారి ఆక్రమణలను తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నగరంలో పలువురు వ్యాపారులు బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు పాటించకుండా టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాల్స్, తినుబండారాలు నడుపుతూ, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నారని, హోటల్స్, రెస్టారెంట్లలో జీవీఎంసీ “షీ” టీమ్స్ ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తూ, ఆహార పదార్థాలలో కార్సినోజెన్స్ ఉన్నట్లు తేలడంతో చట్టపరమైన చర్యలు ప్రారంభించడం జరిగినదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.
ఇంకా, కొన్నిచోట్ల తొలగించిన ఆక్రమణల వద్ద మరలా వ్యాపారులు ఆక్రమణలను ప్రారంభించినట్లు గుర్తించామని, ఇలాంటి ఆక్రమణలను వెంటనే, స్వచ్ఛందంగా తొలగించాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.
ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం అర్హులైన వీధి విక్రయదారుల జీవనోపాధిని, సంక్షేమాన్ని కాపాడుతూ, వారి ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి, అలాగే నగరంలోని ఫుట్‌పాత్‌లు, రహదారులు, జంక్షన్లను అందంగా, ప్రజలకు మరియు వాహనదారులకు అనుకూలంగా మార్చేందుకు చేపడుతున్నామని తెలిపారు .వెండర్ జోన్లు ఏర్పాటు చేసి, అర్హులైన విక్రయదారులను గుర్తించి, నిర్దేశిత ప్రదేశాల్లో అవసరమైన అనుమతులతో వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు.

