చిట్వేల్ అక్టోబర్ 20 (పున్నమి ప్రతినిధి)
ఎన్డీఏ కూటమి దళిత ఎమ్మెల్యే కనుసైగల్లోనే జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దళితుల భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ అక్రమాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా హెచ్చరించింది. దళితుల భూముల జోలికి వస్తే దశలవారీ ఉద్యమాలతో తగిన బుద్ధి చెబుతామని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు.ఈరోజు, భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో, సీపీఐ నేతలు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ సెలవులను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ అధికారులు లేరనే ఉద్దేశంతో మైసూర్ వారి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 2085లో దళితులకు చెందిన దాదాపు 2 ఎకరాల 20 సెంట్ల భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.అదే గ్రామపంచాయతీకి చెందిన జనసేన పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన శాసనసభ్యులు అరవ శ్రీధర్ కనుసైగల్లో ఈ ఆక్రమణకు పాల్పడటం, ఫెన్సింగ్ వేయడమే కాకుండా మామిడి చెట్లు నాటడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమణి, భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ జ్యోతి చిన్నయ్య మండిపడ్డారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో, కోడూరు నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందిన బడా రాజకీయ నాయకులు, పెత్తందారులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి అనుభవిస్తుంటే, రెవెన్యూ యంత్రాంగం వారు ఇచ్చిన ముడుపులు తీసుకుని గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని వారు రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలోని దళితులు జనసేన పార్టీకి ఓట్లు వేసి, అదే పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేను గెలిపించుకుంటే, నేడు జనసేన పార్టీకి చెందిన అగ్రవర్ణాల నాయకులే దళితుల భూములను ఆక్రమించడం, దళితులు తమ చేతులతోనే తమ కళ్లను పొడుచుకున్నట్లుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే, నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమించి అనుభవిస్తున్న అగ్రవర్ణాలకు చెందిన వారి జోలికి వెళ్లి, ఆ భూములను ఆక్రమించి నిరుపేదలకు పంచే దిశలో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ నాయకులు సవాల్ విసిరారు. అగ్రవర్ణాల ఆక్రమణల జోలికి వెళ్లలేని పరిస్థితుల్లో దళితుల భూముల జోలికి రావద్దని, వస్తే దశలవారీ పోరాటాలతో తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్, సహాయ కార్యదర్శి గంగాపురి తేజతో పాటు మైసూర్ వారిపల్లికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


