తుఫాను ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర పంటల నష్ట తీవ్రత మరియు నివారణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు….
తుఫాను ప్రభావంతో నష్టపోయిన తిరువూరు డివిజన్‌లోని కాకర్ల మరియు లక్ష్మీపురం గ్రామాలను అక్టోబర్ 31, 2025న వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు, కె.వి.కె. శాస్త్రవేత్తలు మరియు జిల్లా వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులను కలిసి, పంట నష్టం తీవ్రతను అంచనా వేసి, నివారణ చర్యలపై విలువైన సూచనలు చేశారు.
వరి పంటలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు
తుఫాను కారణంగా వర్షం తగ్గి ఎండ తీవ్రత పెరిగితే, ఎండాకు తెగులు, మానిపండు తెగులు, మాగుడు తెగులు, ఆకుముడత మరియు దోమపోటు వంటి తెగుళ్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
నీటి తొలగింపు: పొలంలో నిలిచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా వెంటనే తొలగించాలి.
తెగుళ్ల నివారణ (రంగు మారడం, మాగుడు, మానిపండు): నిలబడి ఉన్న లేదా పడిపోయిన వరి చేలలో గింజలు రంగు మారడం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తిని నివారించడానికి, ఎకరాకు 200 మి.లీ. ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలి.
మొలకెత్తడాన్ని తగ్గించడానికి: కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనిపిస్తే, నీటిని తొలగించిన తర్వాత, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకెత్తడాన్ని మరియు రంగు మారడాన్ని తగ్గిస్తుంది.
🌿 ప్రత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు
అదనపు నీటి తొలగింపు: ప్రత్తి పంట నుండి నిలబడి ఉన్న అదనపు నీటిని వెంటనే బయటకు తీసివేయాలి.
పోషకాల నిర్వహణ: ఎండగా ఉన్న సమయంలో 1-2% పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కాయ తెగులు నివారణ (ముందు జాగ్రత్త): 90 రోజుల పంటలో కాయ తెగులును నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా కాపర్ ఆక్సీక్లోరైడ్ (COC) 600 గ్రా/ఎకరానికి పిచికారీ చేయాలి.
మచ్చ తెగుళ్ళ నివారణ: ఆకుల మీద వచ్చే మచ్చ తెగుళ్ళను నివారించడానికి కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రా/లీ చొప్పున పిచికారీ చేయాలి.
సూచన: ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళను డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసుకుని కొంతవరకు పంటను కాపాడుకోవలసిందిగా అధికారులు రైతులకు సూచించారు.
ఈ క్షేత్ర సందర్శనలో డాక్టర్ ఏ. మనీ డిన్ (వ్యవసాయ ఇంజనీరింగ్, లాం, ఆంగ్రూ), డి.ఎం.ఎఫ్ విజయ కుమారి (వ్యవసాయ జిల్లా అధికారి), డాక్టర్ ఎం. రవి కిషోర్ (ప్రోగ్రాం కోఆర్డినేటర్), డాక్టర్ పి.యన్ శివ ప్రసాద్, డాక్టర్ ఎన్ రాజశేఖర్, శ్రీమతి పద్మ (తిరువూరు ఏవో) మరియు వి.ఏ.ఏ.లు పాల్గొన్నారు.


