SPS నెల్లూరు జిల్లా వార్తా ప్రకటన
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రోన్ నిఘా కొనసాగుతోంది. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) సూచనలతో, సంబంధిత DSPల ఆధ్వర్యంలో ఆయా CI, SIల సమక్షంలో డ్రోన్ కెమెరాలతో పట్టణం, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు సమగ్రంగా పరిశీలించబడుతున్నాయి.
ఉదయం 9 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు, మరియు రాత్రి 7 నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ నిఘా కొనసాగుతోంది. నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టిన నెల్లూరు పోలీసులు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఓపెన్ డ్రింకింగ్‌పై ఇప్పటికే కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లను కూడా డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
నేరాలకు ఆస్కారం ఉన్న పాడుబడిన బంగ్లాలు, తోటలు, పార్కులు, నదీ తీరాలు వంటి ప్రదేశాలను ముందుగానే గుర్తించి, డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డా. అజిత వేజెండ్ల, IPS గారు పేర్కొంటూ — “జిల్లాలో సాంకేతికతను వినియోగించి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడం మా ప్రధాన లక్ష్యం” అన్నారు.
ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు ప్రజలను అభ్యర్థించారు.


