అమెరికా డ్రగ్స్ ముఠాలపై యుద్ధం ప్రకటించింది. ఇవి దేశ సరిహద్దులు దాటి అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయంటూ, వాటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించినట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ చర్యపై దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చ మొదలైంది.
గత నెల కెరిబియన్ సముద్రంలో వెనిజులా నుంచి వస్తున్నట్లు అనుమానితమైన మూడు పడవలను అమెరికా దళాలు ముంచివేశాయి. ఈ దాడిలో 17 మంది మరణించారు. వారిని “చట్టవిరుద్ధ పోరాట యోధులు”గా పేర్కొంటూ, తమ చర్యలను ఆత్మరక్షణగా అమెరికా సమర్థించుకుంది.
వైట్ హౌస్ విడుదల చేసిన మెమోలో డ్రగ్స్ ముఠాలను విదేశీ శత్రువులుగా పేర్కొనడంతో, ఈ చర్యలను ట్రంప్ ప్రభుత్వం సైనిక స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఏ ముఠాలపై దాడులు జరుగుతున్నాయో, మృతులతో వాటికి సంబంధమేమిటో వెల్లడించలేదు.
ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన డెమొక్రాట్లు, ట్రంప్ రహస్య యుద్ధాలు చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సుమారు 6,500 సైనికులు ఈ ప్రాంతంలో మోహరించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఇది అమెరికా సైనిక జోక్యం కోసం పన్నిన కుట్ర అని ఆరోపించారు.


