డిఫెన్స్ స్పేస్ హబ్ గా ఆంధ్రప్రదేశ్
మేక్ ఇన్ ఇండియాకు మన రాష్ట్రమే ప్రధాన గమ్యస్థానం
పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*:
దేశ రక్షణ, ఏరోస్పేస్ తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రక్షణ, ఏరోస్పేస్ మొదలైన రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఎలా కీలక కేంద్రంగా మారుతుంది అనే అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు. కేవలం వ్యాపార అంశాలకే తాము పరిమితం కాకుండా, రక్షణ, ఏరోస్పేస్ రంగాలు దేశ భద్రతకు దోహదపడే ప్రభావ కార్యకలాపాలలో తాము భాగస్వాములు కావడం ఆత్మ నిర్భర భారత సాకారానికి తమ వంతు సహాయం కూడా అందించడం ఎంతో గొప్ప అవకాశం గా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల పూల్ ను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఏపీలో తయారయ్యే ప్రతి భాగం భారతదేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సెషన్లో పాల్గొన్న అంతరిక్ష, రక్షణ రంగ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అభివృద్ధికి గల అనుకూలతను ప్రశంసించారు. ఇస్రో సలహాదారు డా. ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగానికి చిన్న నుండి పెద్ద రాకెట్లను ప్రయోగించడానికి వీలుగా వికాస్ లాంచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రాకెట్లు, ఉపగ్రహాల తయారీ స్థావరాన్ని స్థాపించడానికి సత్యసాయి జిల్లా, తిరుపతి కారిడార్లలో ప్రాంతాలను గుర్తించామని, ఇక్కడ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డా.చంద్రిక కౌశిక్ (డీఆర్డీఓ), ఏపీ ప్రతిపాదించిన స్పేస్ సిటీ అనేది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు.
హెచ్‌ఎఫ్‌సీఎల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ‘వ్యాపార వేగం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రూ.1400 కోట్ల పెట్టుబడితో రక్షణ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి అవసరమైన అన్ని అనుమతులు “ఓవర్ ఏ ఫోన్” ద్వారానే లభించాయని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఈ కేంద్రం 3,05,000 సెల్స్ ఉత్పత్తి చేస్తుందని, తద్వారా 3500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ జయరామ్ ముమ్మిడి మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు 1 లక్ష ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ఉపగ్రహాలు వంటి అధునాతన సాంకేతికత అభివృద్ధికి కీలకమని డిగంతర సీఈఓ అనిరుధ్ శర్మ తెలిపారు.


