జీవీఎంసీ నూతన జోనల్ కార్యాలయాలను పరిశీలించిన కమిషనర్.
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెండు జోనల్ కార్యాలయాలను మంజూరు చేసిన నేపథ్యంలో 51 వ వార్డు మాధవధార వుడా లేఔట్ లో నిర్మాణ దశలో ఉన్న జీవీఎంసీ నార్త్ జోన్ కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నార్త్ జోన్ కార్యాలయంలో అన్ని సదుపాయాలతో విధులు కార్యాచరణకు సిద్ధం చేయాలని , వార్డు నెంబర్ 85 లో రాజీవ్ గాంధీ కల్యాణ మండపం లో తాత్కాలికంగా అగనంపూడి జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటుకు డిసెంబర్ 15 తేదీ నాటికి పూర్తి చేసి సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజును ఆదేశించారు. బుధవారం ఆయన మాధవధార వుడా లేఅవుట్ లో తాత్కాలికంగా సిద్ధం చేసిన నార్త్ జోన్ కార్యాలయాన్ని, అగనంపూడి లో తాత్కాలికంగా అగనంపూడి జోనల్ కార్యాలయం ఏర్పాటుకు సూచించిన రాజీవ్ గాంధీ కళ్యాణమండపాన్ని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉత్తర్వుల మేరకు ప్రస్తుతమున్న మహా విశాఖ పట్నం నగరపాలక సంస్థ 8 జోన్లకు బదులుగా 10 జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో నార్త్ జోన్ ఏర్పాటు చేయుటకు వార్డ్ 51 నందు మాధవధార వుడా లేఔట్ లో నిర్మాణ దశలో ఉన్న మూడంతస్తుల భవనాన్ని పరిశీలించి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీర్ కు ఆదేశించారు. ఆ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన నార్త్ జోన్ కార్యాలయంలో అన్ని విభాగాలను , నియమించిన అధికారులు, ఉద్యోగుల కేటాయింపును పరిశీలించి , విధులకు కావలసిన ఫర్నిచర్, స్టేషనరీ, లైటింగ్ ,ఫ్యాన్స్ ,నేమ్ బోర్డ్స్, ఎంట్రెన్స్ గ్లో సైన్ బోర్డ్ ,కంప్యూటర్ సిస్టమ్స్, టేబుల్స్, చైర్స్ ,వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, పార్కింగ్ స్పేస్ ,ల్యాండ్ స్కేప్ తదితర అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కార్యాచరణకు సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ కు, జోనల్ కమిషనర్ బి.రాము కు ఆదేశించారు.
అనంతరం ఎన్.ఎ.డి. కొత్త రోడ్డు సమీపంలో వెస్ట్ జోన్ కార్యాలయం ( ప్రస్తుతం జోన్ 5 జ్ఞానాపురం కార్యాలయం) శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు అనువైన స్థల పరిశీలన చేయాలని జోనల్ కమిషనర్ బి. రాముకు ఆదేశించారు.
అనంతరం 85వ వార్డులో రాజీవ్ గాంధీ కళ్యాణ మండపాన్ని పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన అగనంపూడి జోన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు పెయింటింగ్ వేసి,అన్ని మౌలిక సదుపాయాలతో డిసెంబర్ 15 నాటికి జోనల్ కార్యాలయం కార్యాచరణకు సిద్ధం చేయాలని పర్యవేక్షక ఇంజనీరు గోవిందరావుకు కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ బి.ఆర్.ఎస్ శేషాద్రి, పర్యవేక్షక ఇంజనీరు సంపత్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు పద్మావతి, తారా ప్రసన్న ,దిలీప్ , ఎం.ఆర్.ఎస్. అప్పారావు, ఉపకార్య నిర్వహక ఇంజనీరు భరణి కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకట్రావు, సహాయక వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఏపీడి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.


