విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి)
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్లో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది స్వల్ప తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించిన వైసీపీ సభ్యులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ హాల్లో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా కొనసాగింది.



