విశాఖ గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి)
నగర పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సంధ్యానగర్ కాలనీ పక్కన కొనసాగుతున్న క్వారీ కార్యకలాపాలు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. జనవాసాల మధ్యనే అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా బాంబు బ్లాస్టింగ్లు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారీ శబ్దాలతో ఇళ్ల గోడలు కంపిస్తున్నాయని, పలుచోట్ల గోడలకు చీలికలు వస్తున్నాయని వారు వాపోయారు. ప్రతి సారి బ్లాస్టింగ్ జరిగినప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర భయానికి గురవుతున్నారని, గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉండటానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాత్రి వేళల్లో ఆకస్మికంగా బ్లాస్టింగ్లు చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్వారీ పూర్తిగా అక్రమమని, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. “ఇది అక్రమ క్వారీ… వెంటనే మూసివేయాలి” అంటూ నినాదాలు చేశారు. ఏదైనా ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాజువాక రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖలు తమ బాధ్యతను విస్మరించాయని ఆరోపిస్తూ క్వారీ యాజమాన్యానికి కొందరు అధికారులు సహకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే మరింత తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ క్వారీపై విచారణ జరిపించి బ్లాస్టింగ్లను నిలిపివేసి జనవాసాల భద్రతకు హామీ ఇవ్వాలని సంధ్యానగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
Uploaded Video:






