జగ్గయ్యపేట నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సూచన మేరకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బిడిఎల్ సిఎండి ఏ. మాధవరావు, జిఎం ఎన్. సత్యనారాయణ, ఏపీఐఐసీ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.
వారి బృందం వేదాద్రి, జయంతిపురం పరిసర ప్రాంతాల్లో డిఫెన్స్ క్లస్టర్‌కు అనువైన భూభాగాలను సమగ్రంగా పరిశీలించింది. భూస్తితి, రోడ్ కనెక్టివిటీ, నీటి లభ్యత, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలను అధికారులు ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు.
డిఫెన్స్ అధికారులు మాట్లాడుతూ,
“ప్రాంతంలోని అన్ని భూములను పూర్తిగా పరిశీలించాము. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక అంశాలను విశ్లేషిస్తున్నాము. సాంకేతిక మూల్యాంకనం అనంతరం తదుపరి చర్యలు ప్రారంభిస్తాము,” అని తెలిపారు.
అలాగే ప్రాథమిక పరీక్షలతో పాటు భూసామర్థ్య నిర్ధారణ కోసం సాయిల్ టెస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించామని, రాబోయే 15 రోజుల్లో సాంకేతిక బృందాలు తిరిగి వచ్చి మరిన్ని లోతైన పరిశీలనలు చేస్తాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ,
“డిఫెన్స్ క్లస్టర్‌తో జగ్గయ్యపేట పరిశ్రమల కేంద్రంగా మారుతుంది. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది,” అని అన్నారు.
డిఫెన్స్ శాఖ వేగంగా స్పందించి పరిశీలనకు రావడం ప్రభుత్వాల మధ్య సమన్వయపూర్వక కృషి ప్రతిఫలమని తెలిపారు. ఈ మహత్తర ప్రాజెక్ట్ జగ్గయ్యపేటకు రావడంలో కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ మనోహర్, ఎంపీ కార్యాలయం నుండి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


