*జగదాంబ జంక్షన్ లో సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగింపు*
*జనసేన జెండా దిమ్మ తొలగించే విగ్రహం ఏర్పాటు చేయటంపై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు*
*వెంటనే స్పందించిన అధికారులు*
విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించారు.
జగదాంబ జంక్షన్ లో ఎనిమిది ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మ తొలగించి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ సినీ నటులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు, నగర పోలీస్ కమిషనర్ శంకుభద్ర బాగ్చి కి,జీవీఎంసీ కమీషనర్ కు లిఖితపూర్వకంగా పి జి ఆర్ ఎస్ లో సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ విగ్రహాన్ని క్రేన్ సాయంతో తొలగించారు.
*విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదు…మూర్తి యాదవ్*
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రఖ్యాత సినీ నటులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుకు ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, నిబంధనల మేరకు జీవీఎంసీ ఆమోదంతో బీచ్ రోడ్ లో ఇటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తన ఫిర్యాదులో మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా 8 ఏళ్లుగా జగదాంబ జంక్షన్ లో కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినా జనసేన పార్టీ జెండా దిమ్మ పార్టీ సిద్ధాంతాల బోర్డు ఉన్న ప్రాంతంలో వాటిని తొలగించి చెరిపివేసి నిబంధనలకు విరుద్ధంగా కృష్ణ విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.
*పవన్ సభ ఇక్కడే*
నగరం నడిబొడ్డున జగదాంబ జంక్షన్ లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి సభ జరిగిన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మను పూర్తిగా తొలగించడం ,అదే చోట సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం బాధాకరమని,జనసేన నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జనసేనకు జరిగిన ఘోరమైన అవమానం, అపచారం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రముఖుల విగ్రహాలు బీచ్ రోడ్ లో ఏర్పాటు చేస్తుండగా అందుకు విరుద్ధంగా కృష్ణ విగ్రహాన్ని పెట్టటం, అందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ అనుమతి, కౌన్సిల్ ఆమోదం లేకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు.
*సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం*
సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నేరమని, అసలైన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఇలాంటి తప్పుడు చేయరని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన సీనియర్ నేత రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ ద్వారా జండా దిమ్మను పునరుద్ధరించాల్సిందిగా కోరారని గుర్తు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మ ఉన్న ప్రదేశంలో వెనుక జనసేన సిద్ధాంతాలు గోడపై రాసి ఉండేవని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జెండాను తొలగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైందని తెలిపారు . విచిత్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన పార్టీ శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా జెండా దిమ్మను తొలగించటం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
జండా దిమ్మను సిద్ధాంతాల బోర్డును తొలగించడమే కాకుండా, అనుమతి లేకుండా విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడం
ఇది పెద్ద కుట్ర పూరితమైన నేరమని, చట్ట విరుద్ధమని, సుప్రీంకోర్టు గతంలో విగ్రహాల ఏర్పాటపై మార్గదర్శక సూత్రాలను జారీ చేసిందని పేర్కొన్నారు . వాటికి విరుద్ధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దీనిపై మరో మారు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఆ విగ్రహాన్ని తొలగించి జనసేన జెండాను పునరుద్ధరించాలని కోరారు.
*తొలగించిన విగ్రహాన్ని మరో చోట ఏర్పాటుకు సహకరిస్తాం*
జనసేన దిమ్మ స్థానంలో ఏర్పాటుచేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆమోదయోగ్యమైన మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు జనసేన పూర్తిగా సహకరిస్తుందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఇందుకోసం నిబంధనల మేరకు జీవీఎంసీలో కౌన్సిల్ తీర్మానానికి కూడా జనసేన మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.


