ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ చైనా:
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు లో పాల్గొనేందుకు ఆయన తియాంజిన్కు చేరుకున్నారు.
2020లో లద్దాఫ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శిస్తుండటం ఇదే మొదటిసారి.
చైనాలో చివరిసారి 2018లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారతైపై విరుచుకుపడుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
జపాన్లో రెండు రోజుల పర్యటన అనంతరం ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్సీవో సదస్సులో పాల్గొననున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్- చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తన జపాన్ పర్యటన కొనసాగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్- జపాన్ల మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయినట్లు తెలుస్తోంది. భారత్లో వచ్చే దశాబ్దకాలంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తంచేసింది.
సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం సహా కీలకమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.


