సెప్టెంబరు (చేజర్ల పున్నమి ప్రతినిధి)
రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సొసైటీ చైర్మన్ వీరారాఘవ రెడ్డి
రైతులకు మద్దతు ధరతో నేరుగా కొనుగోలు సదుపాయం
కొనుగోలు కేంద్రంపై రైతుల సంతోషం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రైతులకు సహకరించే దిశగా చేజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూదళ్ళ వీరారాఘవ రెడ్డి, ఎన్‌డీసీసీ బ్యాంకు మేనేజర్ భగవాన్,సొసైటీ సీఈఓ ఖలీల్, సొసైటీ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ధాన్యం సేకరణ ద్వారా రైతులకు తగిన మద్దతు ధర లభించడానికి ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని నిర్వాహకులు తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా ఈ కేంద్రానికి విక్రయించడం ద్వారా మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని, లాభం నేరుగా రైతులకు చేరుతుందని వారు వివరించారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ భూదళ్ళ వీరారాఘవ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, పంట కొనుగోలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాల విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.సీఈఓ ఖలీల్ మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధాన్యం తూకం, చెల్లింపులు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2360, పుట్టి రూ.20,136, అలాగే గ్రేడ్–ఏ రకం క్వింటా రూ.2389, పుట్టి రూ.20,306 గా కొనుగోలు జరగనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం తమకు ఎంతో ఉపయుక్తమని, సరైన ధరకు పంట విక్రయం జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


