-ప్రజా సేవలో మర్యాద, కేసుల్లో వేగం తప్పనిసరి: జిల్లా ఎస్పీ
-పాత స్టేషన్‌కు తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశాలు
చిట్వేల్, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ నిర్వహణ తీరు, రికార్డులు, నమోదైన కేసుల పురోగతి వివరాలతో పాటు సిబ్బంది సంక్షేమ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా రెండు అంశాలపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో మర్యాదపోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా, వినయంతో వ్యవహరించాలని, ప్రజా సేవలో సౌమ్యత పాటించడం తప్పనిసరని సూచించారు.కేసుల విచారణ వేగం నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరిత న్యాయం అందించడంలో ఆలస్యం చేయకూడదని ఆదేశించారు.చిట్వేల్ పోలీస్ స్టేషన్ భవనం పాతది కావడంతో, దానికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. అలాగే, నేరాలకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో సమయానికి, ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు.జిల్లా సరిహద్దులో ఉండే ఈ స్టేషన్ పరిధిలోని అనుంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు చేపట్టి, అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక శక్తులను అరికట్టాలని ఆదేశించారు.సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ , వారి వ్యక్తిగత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, చిట్వేల్ ఎస్ఐ జి. నవీన్ బాబు తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


