అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం రెండు విషాద ఘటనలకు వేదికైంది. నేతివారిపల్లె ఎస్.టి. ఎరుకుల కాలనీలో దాసరి ప్రశాంతి (25) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతిచెందింది. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆమె సుమారు తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రాజేష్‌ను వివాహం చేసుకుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి దాసరి రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మరో ఘటనలో కె.కె. వడ్డేపల్లికి చెందిన రాయన శాంతమ్మ (34) కూలీ పనుల నుండి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఎగువపల్లిలో పని ముగించుకొని ట్రాక్టర్‌లో వస్తుండగా, డ్రైవర్ మల్లేశ్వరయ్య నిర్లక్ష్యంగా నడపడంతో కందులవారిపల్లె వద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర శాంతమ్మ పడిపోవడంతో ట్రాక్టర్ కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త మాల్దీవుల్లో పనిచేస్తున్నాడని, ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు ఘటనలపై చిట్వేలి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


