ఘనంగా అమ్మవారి రథయాత్ర
★ అంబికా బాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర
★ పాల్గొన్న ఎమ్మెల్యే, ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్టీలు
*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి*
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం అంబికా బాగ్ రామాలయం నుంచి అమ్మవారి రథయాత్ర శోభాయమానంగా ప్రారంభమైంది.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో శోభారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు ఈ యాత్రను ఘనంగా ప్రారంభించారు.
మేళ తాళాలతో, పండితుల వేద మంత్రాలతో వైభవంగా ఈ యాత్ర కొనసాగింది.
అంబికా బాగ్ ఆలయం నుంచి జగదాంబ జంక్షన్ మీదుగా అలాగే చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ దాటుకొని కొత్త రోడ్డు మీదుగా రథయాత్ర అమ్మవారి ఆలయానికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి రథయాత్ర చాలా వైభవంగా జరిగిందని చెప్పారు.
మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఈ యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ యాత్రలో ట్రస్టీలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈవో తో పాటు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఈ యాత్రకు అటు ప్రజల నుంచి ఇటు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి రథయాత్ర శోభాయమానంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈసారి నిర్వహిస్తున్న అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఊహించని దానికంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని వెల్లడించారు.
దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, ఈఈ రమణ,వి.ఏ నాయుడు ,వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, భద్రరావు, రామ్ కుమార్, కేదార్ లక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


