-భారీ వర్షాల దృష్ట్యా వాగులు, వంకల వైపు వెళ్లొద్దు: ప్రజలకు భావన హెచ్చరిక
-ప్రమాదాలు నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
చిట్వేల్, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో, రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రమాదాలను అంచనా వేసేందుకు సబ్ కలెక్టర్ భావన బుధవారం ఓబులవారిపల్లి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ముఖ్యంగా బాలిరెడ్డిపల్లి మీదుగా ప్రవహిస్తున్న *గుండాల కోన ఏరు* ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు.సబ్ కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీమతి యామిని రెడ్డి కూడా ఉన్నారు.
-ప్రమాదాల పట్ల అప్రమత్తత
ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు, వంకల్లో నీటి శాతం పెరుగుతోందని తెలిపారు. “ఇలాగే వర్షాలు కొనసాగితే వాగులు పొంగి పొర్లుతాయి. వై.కోట, బాలిరెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్లకూడదు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి” అని హెచ్చరించారు.
-వాహనదారులకు ప్రత్యేక సూచన
ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.
-అనవసర ప్రయాణాలు వద్దు
ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని, ఈ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు, సెక్రటరీ సురేష్ ఆర్ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి , స్థానికులు జీవీ రెడ్డి తో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


