విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాకను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు జివిఎంసీ పరిధిలో చేపట్టనున్న కీలక పనులపై వీఎంఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ అభివృద్ధి, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్స్, సర్వీస్ రోడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు, జివిఎంసీ ఫండ్స్, హామ్ విధానంలో చేపట్టే పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పల్లా అధికారులను ఆదేశించారు. కణితి గెడ్డ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసి వరదల నివారణకు శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. అలాగే ప్లేగ్రౌండ్లు, పార్కులు, గాజువాక జోనల్ ఆఫీస్ భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. గాజువాక అభివృద్ధిలో జాప్యం ఉండదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా స్పష్టం చేశారు.




