*గల్లంతైన బీసీ హాస్టల్ విద్యార్థి ఆచూకీ కనుక్కోండి*
*రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం*
*అమరావతి* ( విశాఖ పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం బీచ్ లో బీసీ హాస్టల్ విద్యార్థి గల్లంతు కావడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విద్యార్థి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించాలని జిల్లా కలెక్టర్ ను, డీబీసీడబ్ల్యూను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు. పరవాడ మండలం తానం బీసీ హాస్టల్ లో ఉంటూ రావికమతంలోని తోటవానిపాలెం గ్రామానికి చెందిన సూర్రెడ్డి భానుప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. తుఫాన్ సెలవుల అనంతరం శుక్రవారం సాయంత్ర హాస్టల్ కు వచ్చాడు. శనివారం హాస్టల్ లో ఎఫ్ఆర్ఎస్ వేసి, అదే హాస్టల్ లో ఉంటున్న తోటి స్నేహితులు పదో తరగతి విద్యార్థి ఎం.చందు, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.రామచంద్రతో కలిసి తాము చదువుతున్న తానం ఉన్నత పాఠశాలకు శనివారం ఉదయం వెళ్లారు. వారు స్కూల్ కు వెళ్లకుండా పూర్వ బీసీ హాస్టల్ విద్యార్థి ఎన్.సిద్ధుతో కలిసి పరవాడ మండలంలోని ముత్యాలమ్మ పాలెం బీచ్ కు వెళ్లారు. వారు స్నానానికి సిద్ధమవుతుండగా, సముద్రం ఉధృతంగా ఉందని అక్కడే ఉన్న జాలర్లు హెచ్చరించారు. ఆ మాటలు పట్టించుకోకుండా ఆ నలుగురూ సముద్రంలోకి స్నానానికి దిగగానే, అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. అదే సమయంలో అప్రమత్తమైన జాలర్లు చందు, రామచంద్ర, సిద్ధూను కాపాడారు. అప్పటికే భానుప్రసాద్ అలల ఉధృతికి గల్లంతయ్యాడని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి శ్రీదేవి తెలిపారు. నాలుగు కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గల్లంతైన విద్యార్థి తీవ్రంగా గాలిస్తున్నారన్నారి మంత్రి సవితకు తెలిపారు.
*మంత్రి సవిత దిగ్భ్రాంతి…*
బీసీ హాస్టల్ విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న మంత్రి సవిత.. జిల్లా కలెక్టర్ విజయతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే విద్యార్థి ఆచూకీ కనిపెట్టాలని, కోస్టుగార్డులు, గజ ఈతగాళ్ల సాయం తీసుకోవాలని కలెక్టర్ ను, తక్షణమే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమందించాలని డీబీసీడబ్ల్యూవో శ్రీదేవిని, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజును మంత్రి ఆదేశించారు. విద్యార్థి గల్లంతు కావడంపై ఆ ప్రకటనలో మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


