న్యూ ఢిల్లీ జనవరి
(పున్నమి ప్రత్యేక ప్రతినిధి)
భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిపై విధిస్తున్న అధిక వడ్డీ రేట్లు మరియు పెనాల్టీ ఛార్జీలు సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డులపై వార్షికంగా 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
సమయానికి బిల్లు చెల్లించలేకపోయిన వినియోగదారులపై భారీ పెనాల్టీలు, ఆలస్య రుసుములు విధించడం వల్ల వారు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అవసరాల కోసం తీసుకున్న క్రెడిట్, చివరకు ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తోంది.
ఈ నేపథ్యంలో వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించేందుకు అమెరికాలో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం విశేషం. ఇది వినియోగదారుల హితాన్ని కాపాడే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
అదేవిధంగా భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలిసి వినియోగదారుల తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ తీసుకురావడం ద్వారా లక్షలాది మంది వినియోగదారులకు ఆర్థిక భద్రత కలుగుతుందని, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని కోరారు.



