*క్యాష్ అన్న కొట్టు…లేదా ఫోన్ పే అన్న వెయ్యి
* లంచం ఇవ్వకపోతే నీ ఫోన్ తీసుకుంటా
* లారీ డ్రైవర్ పై వాగ్వాదానికి దిగిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది
*లారీ డ్రైవర్ ను బెదిరించి లంచం వసూలు చేస్తున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది
తొట్టంబేడు : శ్రీకాళహస్తి అటవీశాఖ పరిధిలో తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెం ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూతలపట్టు -నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో ఉన్నది. అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు రోజు రోజుకి దారుణంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పరిధిలో ఎర్రచందనం, కలప, అటవీ సంపద దొంగతనం జరగకుండా చెక్ పోస్ట్ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంది. తమకున్న విధులను పక్కనపెట్టి తమ అధికారాన్ని అండగా చేసుకుని అన్ని అనుమతులు ఉండి కూడా రవాణా చేస్తున్న వాహనదారుల డ్రైవర్లను బెదిరించడం అక్రమ వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది. తమ వద్ద డబ్బులు లేవని డ్రైవర్లు చెప్పినప్పటికీ ఫోన్ పే లో పంపించమని డిమాండ్ కూడా చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ అధికారి పట్టపగలు లారీ డ్రైవర్ వద్ద లంచం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.


