*క్యాన్సర్ పై విజయం – స్క్రీనింగ్ తో సాధ్యం*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
నవంబర్ 7,2025.‘జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ర్యాలీ నిర్వహించారు.సమాజంలో జీవన ప్రమాణాలు పెరగడం, జీవన శైలిలో మార్పులు రావడంతో అసంక్రమిత వ్యాధులు (Non Communicable Diseases- (NCDs)-దీర్ఘ కాలిక వ్యాధులు)పెరుగుతున్నాయి. బి. పి., షుగర్ లతో పాటు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు గుర్తింప బడుతున్నాయి. వీటిలో చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడటంతో రేడియో , కీమో చికిత్సలు తీసుకోవలసిన అవసరం రావడం, తిరిగి నయం చేయలేని స్థితిలో వుండటంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులలో పేషెంట్ తో పాటు కుటుంబాలు అధిక ఆర్ధిక భారం, మానసిక ఒత్తిడి ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ఒకే ఒక పరిష్కారం–“ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం మరియు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం”. బి. పి., షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమని భావనలో వున్నారో, అదే విధంగా క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడంలో వుండాలి. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు , ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాది ఇది. రాష్ట్ర ప్రభుత్వం, 18 సంవత్సరాల పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తోంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి సహకరించండి. అలాగే, మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయి.ఇది కొందరికే వస్తుంది, నాకు రాదు అనే అపోహలు వదిలేయండి.ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా మహిళలు మొహమాటం, బిడియంతో వెనుకంజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి. మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు వుంటే వారిని వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రులలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ కి రిఫర్ చేసి, వెంటనే ప్రత్యేక వైద్య సదుపాయం, ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ఐ. వాణి , ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ డా. కె.వి. ఎస్. ఎం. సంధ్య దేవి , జిల్లా వైద్య ఆరోగ్య వైద్య శాకాధికారి డా. పి. జగదీశ్వర రావు , మెడికల్ అంకోలాజి డిపార్ట్మెంట్ విభాగధిపతి డా.కె. శిల్ప , ప్రీవెన్టివ్ అంకోలాజి నోడల్ అధికారి డా . కె. సాయి సుష్మ , జిల్లా యన్. సి. డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. హారిక మరియు ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .


