కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలపై డాక్టర్ కందుల ధ్వజం
★ టిడిపి వార్డుల అభివృద్ధికి రూ. 100 కోట్ల పనులు అప్పజెప్పడం పై అభ్యంతరం
★ జనసేన కార్పొరేటర్లకు మొండి చేయి చూపించడం పై ఆగ్రహం
★ మేయర్ ను నిలదీసిన డాక్టర్ కందుల
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి *
విశాఖ నగరంలోని నియోజకవర్గాల పరిధిలో వార్డుల పరంగా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల విషయంలో జనసేన పార్టీకి కౌన్సిల్ అన్యాయం చేసిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ధ్వజమెత్తారు.
కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి కేవలం రెండు నియోజకవర్గాలలో తూతూ మంత్రంగా అభివృద్ధి నిధులు కేటాయించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుమారు రూ. 100 కోట్ల రూపాయల నిధులను టిడిపికి కేటాయించడం పట్ల మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఒక పార్టీ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ ఆయన తెలియజేశారు.
జనసేన పట్ల ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు అంటూ నేరుగా మేయర్ ను నిలదీశారు.
మేయర్ కార్పొరేటర్ గా ఉన్న సమయంలో కూటమి పార్టీలకు సమ ప్రాధాన్యత ఉండాలని చెప్పిన వ్యక్తి మేయర్ అయ్యాక ఆ విషయం మర్చిపోయి కేవలం టిడిపికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ ప్రభుత్వంలో ఒక భాగం కాదా అంటూ ప్రశ్నించారు.
టిడిపి కి ఒక న్యాయం జనసేన పార్టీకి మరొక న్యాయమా అంటూ మండిపడ్డారు.
అభివృద్ధినిధుల కేటాయింపు విషయంలో జనసేన పార్టీకి పూర్తిగా అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిక విషయంలో జనసేన పార్టీ పూర్తిగా సహకరించినందుకు తమకు ఈ విధంగా అన్యాయం జరగవలసిందేనా అంటూ ప్రశ్నించారు.
నిధుల కేటాయింపు విషయంలో జనసేన పార్టీ కేడర్ మొత్తం మేయర్ వ్యవహార శైలి పై ఆగ్రహంగా ఉందని చెప్పారు. ఇక టిడిపి అన్ని విషయాలలోనూ జనసేన పార్టీని పక్కన పెట్టేసి ఇలాగే కొనసాగుతాం అంటే అది మీ ఇష్టం అని అన్నారు. జనసేన పార్టీపై వివక్ష చూపిస్తూ జనసేన కార్పొరేటర్ లు ఉండే వార్డుల అభివృద్ధికి సహకరించకుండా ఏకపక్షంగా టిడిపి వ్యవహరించిన తీరుపై డాక్టర్ కందుల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.


