*కొత్తవలస–ఆనందపురం రహదారిలో కృష్ణరాయుడు పేట వద్ద రైవాడ కాలువపై కల్వర్ట్ నిర్మాణానికి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన*
*విశాఖపట్నంనవంబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నం నగరానికి నీటి సరఫరా అందిస్తున్న రైవాడ డ్యాంకు రవాణా సదుపాయాన్ని మరింత బలోపేతం చేయడానికి భాగంగా, కొత్తవలస నుండి ఆనందపురం వెళ్లే రహదారిలో కృష్ణరాయుడు పేట వద్ద రైవాడ కాలువపై కల్వర్ట్ నిర్మాణం పనులకు నేడు స్థానిక మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు శ్రీ *బండారు సత్యనారాయణ మూర్తి* గారితో కలిసి నగర మేయర్ *పీలా శ్రీనివాసరావు* గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ *పీలా శ్రీనివాసరావు* గారు మాట్లాడుతూ—
“రైవాడ డ్యాం విశాఖ నగరానికి ప్రధాన నీటి వనరు. ఈ కాలువపై కల్వర్ట్ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, నగరానికి నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా పనులు సజావుగా కొనసాగుతాయి. ఈ రోజు స్వయంగా రైవాడ డ్యాంను పరిశీలించగా నీటి స్వచ్ఛత చాలా మంచి స్థాయిలో ఉందని గుర్తించారు. కల్వర్ట్ పనులు నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను” అని తెలిపారు.
ఎమ్మెల్యే *బండారు సత్యనారాయణ మూర్తి* గారు మాట్లాడుతూ—
“విశాఖ నగర మేయర్ నాకు అత్యంత ఆప్తుడు. నేను కోరగానే ఈ కల్వర్ట్ నిర్మాణానికి 91 లక్షలు మంజూరు చేయడం గర్వకారణం. అలాగే జీవీఎంసీ నుండి ఇరిగేషన్ శాఖకు బాకీగా ఉన్న కోటీ రూపాయల నీటి చార్జీల చెల్లింపులు కూడా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో నగరానికి నిరంతర త్రాగునీరు అందించే రైవాడ జలాశయం అభివృద్ధి పనులకు మేయర్ గారు పూర్తిగా సహకరించాలని మనవి చేస్తున్నాను” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, కూటమి నాయకులు, సంబంధిత శాఖాధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


