కొండపల్లి మున్సిపాలిటీలో మూకుమ్మడి దోపిడీ…?
ప్రొసీజర్ ప్రకారం పనులు చేయడం లేదంటూ ఆరోపణలు..?
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 03 పున్నమి న్యూస్. మున్సిపాలిటీలోనైనా , గ్రామ పంచాయితీలో నైనా ఏదైనా పని చేయాలంటే ముందుగా పాలక వర్గంలో సదరు పని గురించి చర్చించి ఆ పని తప్పని సరిగా అవసరం అనుకుంటే పాలక వర్గం ఆ పని చేయించడానికి ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత ఆ పని అంచనా విలువ కోసం డివిజనల్ ఇంజనీర్ కు పంపుతారు. ఈ ప్రక్రియను సిఆర్ 1 అంటారని తెలుస్తోంది. డివిజనల్ ఇంజనీరు అంచనా వేసి అనుమతులు ఇచ్చాక ఆ పనిని చేయించడానికి టెండర్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా గుత్తేదారుకు పని అప్పగిస్తారు. దీనిని సిఆర్ 2 అని అంటారని తెలుస్తోంది. గుత్తేదారు పని పూర్తి చేశాక బిల్లులు చెల్లిస్తారు. కానీ కొండపల్లి మున్సిపాలిటిలో అందుకు విరుద్దంగా జరుగుతుందని సమాచారం. మున్సిపాలిటీలో చైర్మన్ దోపిడీ కోసం నిర్మాణం చేసిన చైర్మన్ చాంబర్ భవనానికి పాలక వర్గం ఆమోదం లేకుండానే, డివిజనల్ ఇంజనీరు అంచనాలు వేయకుండానే, అనుమతులు ఇవ్వకుండానే, టెండర్ పిలువకుండానే చైర్మన్ ఏక పక్ష నిర్ణయంతో కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు పనులు చేయించారనే ఆరోపణలను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో మున్సిపాలిటీ అధికారులను నిలదీయడం సంచలనం కలిగిస్తుంది. పూర్తయ్యాక, ఆ నిర్మాణాన్ని వాడుకలోకి తీసుకువచ్చాక కూడా ఇంకా పాలక వర్గం ఆమోదం తెలుపక పోవడం ఒక వింత అయితే , డివిజనల్ ఇంజనీరు ఇంకా అంచనాలు వేయక పోవడం , నియోజకవర్గం ఎమ్మెల్యే చేతనే ప్రారంభోత్సవం చేయించడం విడ్డూరంగా ఉందంటూ స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క మున్సిపాలిటీ లో ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా గానీ విపక్ష సభ్యులు పట్టించుకోకపోవడంతో పాటు స్వపక్షం లోని కౌన్సిలర్ లే జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడం కొసమెరుపు. ఇదే తరహాలో 2009 లో మైలవరం గ్రామ పంచాయితీ పరిదిలో సర్పంచి పాలక వర్గం అనుమతి లేకుండా పంచాయితీ నిధులతో గ్రావెల్ తోలించారనే ఆరోపణల నేపద్యంలో జిల్లా కలెక్టర్ సదరు గ్రామ పంచాయితీ సర్పంచిని పదవి నుండి తొలగించారని సమాచారం. అయితే కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలో జరిగిన పలు అభివృద్ది పనులకు పాలక వర్గం అనుమతులు లేకుండానే నిధులను ఖర్చు చేయడాన్ని లేదా గుత్తే దారుతో పనులు చేయించడాన్ని పాలక వర్గం సభ్యులు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. చైర్మన్ మాత్రమే మున్సిపాలిటీలో అన్ని నిర్ణయాలను ఏక పక్షదోరణిలో తీసుకుంటున్నారని మిగిలిన సభ్యులను సంతకాలు మాత్రమే చేస్తే చాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మరో పక్క చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. నెలల తరబడి విద్యుత్ స్థంభాలకు లైట్లు వేయకుండానే వేసినట్లుగా గ్రామంలో ఒకరు ఇద్దరు గ్రామస్తులతో సంతకాలు చేయించుకుని కొనని విడి భాగాలను కొనుగోలు చేసినట్లు గా చూపుతూ దొంగ బిల్లులను పెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా పనులను నామినేషన్ ల పేరుతో లక్షలాది రూపాలయలను పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో స్టాక్ రిజిస్టర్ లో కూడా చాలా తేడాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో వీది దీపాలు, బ్లీచింగ్, సున్నం, కుళాయిలకు చెందిన విడిభాగాలను కొనుగోలు చేయకుండానే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 15 నెలలుగా తారు పనులు చేసినట్లుగా లెక్కల్లో చూపుతూ తారు కంపెనీకి చెందిన వ్యక్తి పేరుతో బిల్లులు పెట్టుకుని మున్సిపాలిటీ నిధులు కాజేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. స్థానిక సంస్థల నియమ నిబంధనల ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు లాభసాటి వ్యాపారాలు చేసినట్లు రుజువైతే వారిపైన అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే మున్సిపాలిటీలో చైర్మన్ కుమారుడు, వార్డు కౌన్సిలర్ కుమారుడు మున్సిపాలిటీలో పనులను చేయిస్తామంటూ నామినేషన్ పనులను తీసుకుంటున్నారని దీంతో వారు సరిగా చేసినా, చేయక పోయినా వారిని అధికారులు గట్టిగా నిలదీయలేక పోతున్నారనే వాధనలు లేకపోలేదు.
*మున్సిపాలిటీ అధికారుల చేతివాటం…?*
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలం ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన భారీ బహుళ అంతస్థుల భవనానికి పన్నులు విధించే విషయంలో మున్సిపాలిటీలోని ఇద్దరు కీలక మహిళా అధికారులు చేతివాటం ప్రదర్శించి భారీ మొత్తంలో పన్ను మినహాయించారనీ, అందుకు నజరానా గా భవనం యజమానికి చెందిన విజయవాడ లోని ఓ నగల దుఖాణం నుండి బంగారు కానుకలను మహిళా అధికారులకు సమర్పించుకున్నారని సమాచారం. దీనిపైన ఎసిబి అధికారులు విచారణ చేపడితే కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భవనాలకు మినహాయింపు ఇస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడిన వారవతారని స్థానికులు కోరుతున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న గోల్ మాల్ పైన జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.


