-కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో కార్మికుల భారీ నిరసన
-లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ విజయవంతం చేయాలి
-పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. దాసరి జయచంద్ర పిలుపు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ (కార్మిక చట్టాల సవరణ) అమలును నిరసిస్తూ, భారత విప్లవ మార్క్సిస్టు పార్టీ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద ‘బ్లాక్ డే’ నిర్వహించారు. ఆర్ఎంపియు పంచాయతీ మరియు స్వచ్ఛభారత్ కార్మికుల జిల్లా కన్వీనర్ చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా దాసరి జయచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మికులు గత ఫిబ్రవరి 12న సమ్మె చేసి తమ నిరసన తెలిపినప్పటికీ, మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్స్ అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మిక సంఘాలతో కనీస సంప్రదింపులు జరపకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చారని విమర్శించారు. “పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప” అన్న కార్ల్ మార్క్స్ నినాదాన్ని గుర్తు చేస్తూ, కార్మిక వర్గం తమ హక్కుల కోసం వీరోచిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు తమ పని ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో నిరసన గళం విప్పాలని, ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ సిబ్బంది, ఆర్ఎంపియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న పాలకుల తీరును ఎండగట్టారు.


