*ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరచిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా*
గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే పల్లా ఆటో కార్మికులతో కలిసి స్వయంగా ఆటో నడుపుతూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను వివరించానని గుర్తు చేశారు.ఆ ప్రతిఫలం నేడు కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.ఆటో సోదరులకు ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఆటో,ట్యాక్సీ,మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లను గుర్తించి మొత్తం 2,90,234 మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం 435.35 కోట్ల నిధులు కేటాయించడం విశేషం అని .గత జగన్ రెడ్డి పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర నిర్లక్ష్యానికి,అవమానానికి గురయ్యారని,ఇంధన ధరల పెరుగుదల, పన్నుల భారాలు, జరిమానాల ఒత్తిడి, పోలీసుల వేధింపులు ఇవన్నీ కలసి వారి జీవనోపాధిని సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు.అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు,బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు,కార్పొరేటర్లు రాజాన రామారావు,రౌతు శ్రీనివాస్,నేతలు గడసాల అప్పారావు,పుచ్చా విజయ్ కుమార్,కరణం కనకారావు, రౌతు గోవింద్,ప్రాంతీయ రవాణా శాఖ అధికారి జయప్రకాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు,సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు


