కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ కోసం, విశాఖ ప్రజలకు, విశాఖ స్టీల్ ప్లాంటుకు ద్రోహం చేసే నిర్ణయం ఆపాలి.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు అక్రమ నీటి కేటాయింపులు రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంటుకు, విశాఖ ప్రజలకు ద్రోహం చేయడం ఆపాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. జగన్, వి. క్రిష్ణరావులతో కలిసి నేడు జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ కోసం 25 లక్షల మంది విశాఖపట్నం ప్రజానీకానికి, విశాఖ స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏలేరు కాలువ నుండి 33ఎంజీడిల నీటిని మిట్టల్కు కేటాయించింది. దీనివలన విశాఖ నగర ప్రజలకు,విశాఖ స్టీల్స్టాంట్కు తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గోదావరి, ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి 80 ఎంజిడీలు నీరు ప్రస్తుతం సరఫరా అవుతోంది. దీనిలో జివియంసికి 36, విశాఖ స్టీల్స్టాప్లాంట్కు 32, ఎన్టీపిసికి 7.14, ఎస్ఐబసికి 4,19, అదానీ గంగవరం పోర్టుకు 0.22, ఆరడబ్ల్యుఎన్కు 1.04 ఎంజిడీలు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు కాలువ ద్వారా విశాఖపట్నానికి సరఫరా అవుతున్న 80 ఎంజిడీలు నీటిలో 33 ఎంజిడీల నీటిని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు కేటాయించింది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన త్రాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వస్తున్న నీటిని మిట్టల్కు కేటాయిస్తే విశాఖపట్నం ప్రజల యొక్క తాగునీటి సమస్య మరింత అధికమవుతుంది. ఇప్పటికే స్టీల్స్టాంట్ను కేంద్ర ప్రభుత్వం అష్టదిగ్బందం చేస్తోంది. వీటికి తోడు నీటి సమస్య సృష్టించి విశాఖ స్టీల్ ప్లాంటును దెబ్బతీయాలని చూడటం దుర్మార్గం.
గోదావరి నుండి విశాఖకు ఏలేరు కాలువ నిర్మాణం స్టీల్స్టాంట్ నిధులతో జరిగింది. పైపులైన్ నిర్మాణం కోసం స్టీల్ ప్లాంట్ 240కోట్లు, జీవియంసి 60కోట్లు, ఎన్టీపిసి 50కోట్లు రూపాయిలు మొత్తం 360 కోట్లు రూపాయిలు ఖర్చుచేసాయి. ఇది ప్రజల సంపద ఈ సంపద మీద ఆర్సెలార్ మిట్టల్కు ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం కల్పిస్తుందని ప్రశ్నించారు. దీనితోపాటు మిట్టల్ స్టీల్ నీటి సరఫరా కోసం శరభన్నపాలెం నుంచి ఎత్తిపోతల ద్వారా దాదాపు 46.6 కి॥మీ॥ పైపులైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోంది. దీనికి 660కోట్లు రూపాయిలు ఖర్చు అవుతోంది. దీనిని జివియంసి ద్వారా ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుండి అప్పుతీసుకొని ఈ పైపులైన్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మిట్టల్ ఏమైనా పేదవాడా ? దేశ సంపన్నుల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా దాదాపు 3లక్షల కోట్లు ఆస్తి కలిగివున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నీటికి 660కోట్లు పెట్టుబడులు పెట్టుకోలేరా! ఆయన డబ్బులతో ప్రత్యేకమైన వైపులైన్ ఏర్పాటు చేసుకోమని చెబితే ఎవరికీ అభ్యంతరముండదు.
కానీ జివియంసి ద్వారా అప్పు చేయించి, ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుండి ఈ అప్పులు తీర్చడానికి ప్రభుత్వం పూనుకోవడం ప్రజల సొమ్మును మిట్టలు దోచిపెట్టడమే అవుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థ విశాఖపట్నం పోర్టుకు జీవియంసి ద్వారా ఒక కిలో లీటర్ కు 90రూపాయిలు చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిట్టల్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక కిలో లీటర్కు 50రూపాయిలకే 10సం॥లకు నీటిని సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థకేమో అధిక రేటుకు సరఫరా చేసి ప్రైవేటు మిట్టల్ సంస్థకు తక్కువ రేటుకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు.
మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పెద్దగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో 5500మంది కాంట్రాక్టు కార్మికులను, 2500మంది పర్మినెంట్ కార్మికులను విధుల నుంచి ఎందుకు తొలగించారు. మరో 2000 మందిని తొలగించేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారు. ఒక్క విశాఖ స్టీల్స్టాంట్లోనే 10వేల మందిని ఉ న్న ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. రక్షణ రంగం, పోర్టు, హెచ్పీసిఎల్, బిహెచ్ఐఎల్, షిపోయార్డు తదితర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు.
ఈ మొత్తం పరిణామాలు చూస్తే అభివృద్ధి పేరుతో ప్రజల సంపదను, ఆస్తిని మిట్టల్ తదితర కార్పొరేటర్లకు కట్టబెట్టడమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వున్నది. దీనిలో భాగమే ఈ అక్రమ నీటి కేటాయింపులన్నారు. 25 లక్షల మంది విశాఖ ప్రజలకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు హాని చేసేటటువంటి ఎలేరు కాలువ ద్వారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు నీటి కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి. జివియంసి నిధులతో కాకుండా, ఆర్సెలార్ మిట్టల్ సొంత నిధులతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా పరిశీలించాలి. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని ఎదుర్కొవల్సి వుంటుందని హెచ్చరించారు


