అలంపూర్ : పున్నమి ప్రతినిధి :-
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ సమీపంలో పూర్తిగా దగ్ధమయింది. 20 మందికి మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర 2.14 నిమిషాలకు ఈ బస్సు వెళ్లినట్లు రికార్డ్ అయింది. చివరిగా ఇటు నుంచి వెళ్లిన తర్వాత కర్నూల్లో కాసేపు నిల్చొని బయలుదేరిన 10 నిమిషాలకే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన ప్రయాణికులకు కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటన జరగడం అందర్నీ కలవరపెడుతుంది. బస్సు పూర్తిగా దగ్ధం జరిగిన సంఘటన స్థలంలో కుటుంబ సభ్యుల రోదన అందరిని కంటతడి పెట్టిస్తుంది.
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ‘పాలెం’ ఘటన రిపీట్…
ఇదే అక్టోబర్ మాసంలో… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో, పాలెం దగ్గర 2013లో బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి రాష్ట్రాలను కుదిపేసింది. కారును ఓవర్టేకింగ్ చేస్తూ కల్వర్టును ఢీ కొట్టడంతో అగ్ని ప్రమాదం సంభవించి బస్సులో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంత పెద్ద సంఘటన జరగడం ఇదే రెండోసారి.


