ముస్తాబాద్/ మార్చి/ పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ మరియు ఇతర రంగాల కార్మికులను “సీఎస్సీ ఆరోగ్య రక్ష” పేరుతో రక్త పరీక్షలు చేయించుకోవాలని బలవంతం చేస్తున్నారని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. లేబర్ కార్డు ఆన్లైన్ కావాలంటే తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోవాలని చెప్పి అమాయక కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనివల్ల గ్రామీణ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే ఏఎల్ఓ, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీధర్, కుల శ్రీనివాస్, శ్రావణపల్లి ప్రభాకర్, ఇసంపల్లి రాజయ్యతో పాటు వివిధ మండలాల సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.


