కార్తీక మాస పుణ్యకాలంలో భక్తి భావం ఉరకలేస్తోంది. నక్కలపల్లి గ్రామంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణిమ సందర్భంగా నిర్వహించిన 15వ రోజు ప్రదోషకాల పంచామృతాభిషేకం, జ్వాలా దర్శనం, విశేషాలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి.
సాయంత్రం సమయంలో వేద మంత్రోచ్చారణల మధ్య పంచామృతంతో స్వామివారికి ఘనాభిషేకం నిర్వహించగా, ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలతో మార్మోగింది. అనంతరం జరిగిన జ్వాలాదర్శన కార్యక్రమంలో భక్తులు స్వామి దివ్యరూపాన్ని దర్శించి పరమానందాన్ని పొందారు.
కార్తీక దీపాల కాంతులతో దేవస్థానం వెలుగుల మేళాగా మారగా, భక్తులు “ఓం నమశ్శివాయ” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. ప్రత్యేకంగా చేసిన పుష్పాలంకరణ స్వామివారి శోభను మరింత పెంచింది.
దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు – కార్తీక మాసంలో ప్రతిరోజూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని భవానీ శంకరుని కృపను పొందాలని ఆకాంక్షించారు.


