ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకుంటాము. మానవ మనస్సులోని సృజనాత్మకతను, భావ వ్యక్తీకరణను గౌరవించడానికి, కవిత్వం ద్వారా భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి అంతరించిపోతున్న భాషలకు ప్రాముఖ్యతనివ్వటానికి మరియు కవిత్వాన్ని చదవడం, రాయడం వంటి ప్రక్రియలను ప్రోత్సహించచాలనే ప్రధాన లక్ష్యంతో 1999లో పారిస్‌లో జరిగిన యునెస్కో 30వ సాధారణ సమావేశంలో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించారు. కవిత్వం అనేది వివిధ సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, వర్క్‌షాపులు మరియు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మన తెలుగు భాషలో కూడా ఎందరో మహానుభావులు కవిత్వం ద్వారా సామాజిక మార్పుకు, చైతన్యానికి కృషి చేసిన వారున్నారు. వారందరినీ గుర్తుచేసుకుంటున్న సందర్భంగా పాఠకుల కోసం ఈ కవిత
కవిత్వం జనజీవన తత్వం
జీవితాన్ని ప్రతిబింబించే లాలిత్యం
భావాత్మకజాలంలో తన్మయత్వం
మారుతున్న సమాజ భావకత్వం
ఊగిసలాడే ఊహలపల్లకీ గీతం
ఆలోచన సాగరాన్ని మదించే మంత్రం
అనుభవాలమాటున కలలపారిజాతం
అంతరంగంలో ఉద్భవించే ప్రకృతిజలపాతం
ఊహల పందిరిలో హరివిల్లుల అద్భుతం
భావాకృతిని ఆక్రమించుటలో స్వచరితం
పాఠమైనా గుణపాఠమైనా విశ్లేషించువసంతం
మనసును రంజింపచేయు సృజనాత్మకత్వం
ధ్వనించు శబ్దంలో నిగూఢత్వం
సమాసమానతలను తెలిపే అవసరసత్యం
కదిలించే ఘటనల నిత్య ఆలోచనత్వం
చైతన్యరాగాల ఆధునిక రూపకత్వం
నిరంతర సాధనల అన్వేషణత్వం
జీవన శృతిలయల మధురత్వం
మదిమదిని మురిపించే దైవత్వం
అనుభూతుల అక్షరరూపకం వర్ణనాతీతం

