సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు శనివారంతో ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని, గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో మార్గశిర మాస పూజను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, “కోరిన కోరికలు తీర్చే అమ్మవారి వేడుకను ప్రారంభించే అవకాశం దక్కడం నా పూర్వ జన్మ సుకృతం” అని పేర్కొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి పోలి పాడ్యమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాల కాలంలో దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు.
అమ్మవారి అనుగ్రహం విశాఖపట్నం నగరంతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ప్రర్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఏఈఓ ఆనంద్, రాజేంద్ర, ఈఈ రమణ మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


