కంపానియన్ షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న సయ్యద్ మెహతాజ్ బేగం..
విజయవాడ అక్టోబర్ పున్నమి ప్రతినిధి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన కంపానియన్ షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డులు – 2025 కార్యక్రమంలో మానవతా మరియు సామాజిక సేవ విభాగంలో సయ్యద్ మెహతాజ్ బేగం గారికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.
సామాజిక సేవ పట్ల అంకితభావంతో, మానవతా విలువలను జీవన విధానంగా మార్చుకొని, ప్రజల సమస్యలను తనవిగా భావించి సేవా మార్గంలో నడుస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం ఈ అవార్డుల ఉద్దేశమని కంపానియన్ షిప్ బృందం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది నామినీలలోంచి అర్హులను ఎంపిక చేయడం చాలా కష్టసాధ్యమైన ప్రక్రియగా ఉందని వారు వివరించారు.
బృంద సభ్యులు మాట్లాడుతూ — “సయ్యద్ మెహతాజ్ బేగం గారి లోని సామాజిక స్పృహ, మానవతా దృక్పథం, ప్రజల పట్ల ఉన్న కరుణాభావం, మరియు సేవా నిబద్ధత ఆమెను నిజమైన మార్పు సృష్టికర్తగా నిలబెట్టాయి” అని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సయ్యద్ మెహతాజ్ బేగం గారు — “ఈ అవార్డు నాకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను గుర్తు చేస్తోంది. సేవ అంటే మాటల్లో చెప్పదగినది కాదు, అది మనసులో పుట్టే తపన. ప్రతి బాధితుడి చిరునవ్వే నా నిజమైన బహుమతి” అని భావోద్వేగంగా అన్నారు.
మెహతాజ్ బేగం సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సహాయం చేస్తూ, బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, మానవతా విలువలను విస్తరింపజేయడంలో ఆమె నిరంతర కృషి కొనసాగిస్తున్నారు.
సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, తన సేవలతో ఎంతోమందికి ప్రేరణగా మారిన సయ్యద్ మెహతాజ్ బేగం గారికి ఈ అవార్డు మరొక మైలురాయిగా నిలిచింది. స్థానిక ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సమాజంలో మానవతా విలువలను పరిరక్షిస్తూ, సేవా భావంతో ముందుకు సాగుతున్న మెహతాజ్ బేగం గారి సేవలు చిరస్మరణీయంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు.


